కన్నీళ్లు తెప్పించే అవ్వ కథ || Telugu Emotional & Heart touching story o...


*** పండ్లు అమ్మే అవ్వ *** గోపి చాలా పిసినారి. అతని పిసినారి తనం గురించి తెలిసి బంధువులెవ్వరూ అతని ఇంటికి వచ్చేవారు కాదు. అతని గుణం తెలిసి ఎవ్వరూ స్నేహం చేసేవారు కాదు. దాంతో ఒంటరిగా ఆనందంగా గడిపేవాడు. "ఇల్లు బోసిపోయిందనీ, ఎవరూ రాక వెలవెల బోయిందని చుట్టు ప్రక్కల వాళ్ళు బోలెడు మాటలు అంటుంటారు. వాళ్ల మాటలన్నీ పట్టించుకుంటే ఉన్నదంతా హారతి కర్పూరంలా కరిగిపోతుంది. పూలు అమ్మిన చోట కట్టెలు అమ్ముకోవాలి.. ఇప్పుడు ఒంటరిగా హాయిగా ఉంది." అనుకుంటూ సంబరపడేవాడు. కావలసినది వండుకుని తినేవాడు. ఒకరోజు అదే వీధిలో "పండ్లు అమ్మా పండ్లు.. రకరకాల పండ్లు.. తాజా తాజా పండ్లు.." అంటూ ఓ వృద్ధురాలు తలపై పండ్ల గంప పెట్టుకుని అమ్ముకుంటూ కనిపించింది. "ఏమ్మా..ఇలారా.." అని పిలిచాడు గోపి. గోపి ఇంటికి వచ్చి.. "కాస్త గంప దించయ్యా" అన్నదామె. గంప దించి "యాపిల్ పండ్లు ఎలా ఇస్తున్నావ్?" అని అడిగాడు. "వంద రూపాయలకు నాలుగయ్యా" చెప్పింది అవ్వ. "మరీ అన్యాయం... బయట ఏనిమిది ఇస్తున్నారు" అంటూ బేరం పెట్టాడు. "ఐదు తీసుకో నాయన.." అంటూ పండ్లు తీసింది అవ్వ. "లేదులే.. ఆరు ఇచ్చేయ్.. " అని గీచిగీచి బేరం ఆడి, ఆరు పండ్లు తీసుకుని వంద రూపాయలు ఇచ్చాడు. "గంప కాస్త పట్టయ్యా" అన్నది అవ్వ తనవైపు పట్టుకుని. గంపను పైకి లేపుతూ చాకచక్యంగా మరో రెండు యాపిల్ పండ్లు తీసి ఇంట్లోకి విసిరాడతను. అవ్వ మళ్లీ పండ్లు అమ్ముకుంటూ ఆ వీధిలోంచి వెళ్ళిపోయింది. "అబ్బా.. ఎంత ఆశో ఈ ముసలిదానికి.. రోజులు దగ్గర పడుతున్నా, ఇంకా మూటలు కడుతున్నది" అంటూ వెటకారంగా నవ్వుకున్నాడు. అప్పటి నుంచి అవ్వ పండ్లు అమ్ముకుంటూ ఆ వీధిలోకి వచ్చినపుడల్లా.. గోపి పిలపడం, బేరం ఆడటం.. గంప ఎత్తడానికి సాయం పడుతూ ఒకటో రెండో పండ్లు లాఘవంగా తీయడం మొదలుపెట్టి.. ముసలిదాని రోగం కుదిర్చానని సంతోషపడేవాడు. కొన్నాళ్ల తరువాత ఎప్పటిలాగే గంప పైకెత్తుతూ ఈ సారి ఎక్కువ పండ్లు లేపేశాడు. అంతలోనే ఒక అమ్మాయి పుస్తకాల సంచిని మోసుకుంటూ అక్కడికి వచ్చి "నానమ్మా.. నానమ్మా.. నన్ను స్కూల్ నుంచి పంపేశారు..." అంటూ ఏడుస్తూ చెప్పింది. అవ్వ కంగారుగా "అయ్యో నా బిడ్డ.. బాబూ... కాస్త గంప కిందికి దించు" అన్నది గోపితో. "ఏడవకమ్మా... నేనొచ్చి చెబుతాలే. ఫీజు రేపు కడతాలే.. నా తల్లే... ఇంటికిపోదాం పద" అంటూ పాపను ఓదార్చింది. గోపికి ఏం అర్ధం కాలేదు. "ఎవరీ పిల్ల?" అడిగాడు అవ్వను. "నా మనవరాలు బాబూ... వ్యవసాయంలో సాయం చేసేవారు లేక, పంట నష్టం రావడంతో నా కూతురు, అల్లుడు పురుగుల మందు తాగి మాకు దూరమైపోయారు. మా ఆయన మూడేళ్ళ బట్టీ మంచం మీదున్నాడు. ఈ నలుసును సాకడానికి చిల్లిగవ్వ లేదు. ఎప్పుడూ బయటకు వచ్చి ఎరగని నేను అరువు మీద పండ్లు తీసుకుని, వీధి వీధి తిరుగుతూ అమ్ముకుంటూ పైసాపైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నా. చూడు బాబు... పసిపిల్ల అనే కనికరంకూడా లేకుండా ఫీజు కట్టలేదని బయటకి పంపించారు." అన్నది కళ్ళు తుడుచుకుంటూ. అవ్వ చెప్పిందంతా విన్న తరువాత గోపికి నోటమాట రాలేదు. క్షణకాలం విగ్రహంలా బిగుసుకునిపోయాడు. "ముసల్దానికి ఎంత డబ్బాశ" అనే తన వెకిలిమాటను తలుచుకుని చాలా బాధ పడ్డాడు. ప్రతి కష్టం వెనుక ఒక కన్నీటి గాధ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తనను తానే శపించుకున్నాడు .... క్షణం కూడా ఆలోచించకుండా.. జేబులోంచి డబ్బు తీసి "అవ్వా ... ఈ డబ్బు తీసుకుని మనవరాలి ఫీజ్ కట్టెయ్యి" అని బలవంతంగా అవ్వ చేతిలో పెట్టాడు. "బాబూ .... ఇంత అప్పు తీర్చాలంటే నాకు చాలా కాలం పడుతుంది" అన్నది వణుకుతూ.. "అప్పని ఎవరు చెప్పారు? నా తృప్తి కోసం ఇస్తున్నాను.. ఇప్పుడే కాదు, నీ మనవరాలి చదువు అయ్యేంతవరకు నేనే ఫీజ్ కడతాను.. అవతల ఇంటి దగ్గర పెద్దయన ఎదురు చూస్తుంటాడు, వెళ్లు అవ్వ.." అని గంప పైకెత్తాడు గోపి. దాంతో ఆ అవ్వ పాపను తీసుకుని, చాలా సంతోషంగా తన ఇంటికి బయలుదేరింది. మరునాడు గోపి నిద్రలేచి తలుపు తీశాడు. వాకిట్లో రకరకాల పండ్లతో నిండిన బుట్ట కనిపించింది.. చాలా ఆనందం వేసిందతనికి.. తరువాత అతని ఇంటికి బంధువుల రాక ఎక్కువైంది, స్నేహితులూ పెరిగారు.. "ఎదుటి వారికి సాయం చేస్తే ఎంత తృప్తిగా ఉంటుందో, సమాజం ఎంత అందంగా కనిపిస్తుందో" గోపికి అవ్వ కారణంగా తెలిసింది.

Comments

Popular posts from this blog