కప్పల కష్టాలు నీతి కథ || Troubles of the Frogs telugu video || grandma ...


#కప్పలకష్టాలునీతికథ #Telugukathalu #bedtimestories ************ కప్పల కష్టాలు *********** అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెరువు వుండేది. ఆ చెరువులో చాలా కప్పలు నివశిస్తూ వుండేవి. అవన్నీ ఏ చీకూ చింతా లేకుండా కలిసిమెలిసి హాయిగా బ్రతికేవి. ఆ చెరువు దగ్గరకు తరచూ నీళ్లు తాగేందుకు ఏనుగులు వస్తూ వుండేవి. నీళ్ళు తాగేటప్పుడు ఆ ఏనుగులు మాట్లాడుకునే మాటలను శ్రద్దగా వినేవి ఆ కప్పలు. కొంత కాలానికి వాటికి సరికొత్త విషయం ఒకటి తెలిసింది. ఏనుగులు తమను తాము పాలించుకోవడానికి ఒక గజరాజుని ఎన్నుకున్నాయని! ఈ వార్త విన్నాక ఏనుగులకే రాజు అవసమైనప్పుడు తమకు మాత్రం ఎందుకవసరం లేదు? తమకూ ఓ రాజు కావాలి! అనే ఆలోచన రేకేత్తింది కప్పలకు. వనదేవతను ప్రార్థించాయి. వెంటనే దేవత ప్రత్యక్షం అయ్యి వాటి కోరక ఏంటో చెప్పమంది. " మాకో రాజుని ఇవ్వు తల్లీ! " అని అడిగాయి కప్పలు. " ఇప్పుడు హాయిగానే ఉన్నారుగా! ఇంకా రాజెందుకు?" అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది దేవత. " ఏనుగులకే రాజు ఉన్నప్పుడు మాకు మాత్రం ఉండొద్దా?." " పోనీ, మీలోనే ఒకరిని రాజుగా ఎంచుకోరాదూ?" . " లేదులేదు.. మాకు కొత్త రాజే కావాలి!" అని గోల చేసాయి కప్పలు. వాటి అమాయకత్వానికి జాలి పడిన వనదేవత ఒక కుండను చెరువులోకి విసిరి మాయమైపోయింది. ఒకటి రెండు రోజులు కుండకి దూరంగా వున్నాయి కప్పలు. భయం పోయాకా కుండ మీదకి గెంతసాగాయి. ఎలా గెంతినా కుండ ఉలుకూ పలుకూ లేదు. తనివితీరా గెంతి గెంతి " ఓస్! రాజంటే ఇంతేనా?" అని అనుకున్నాయి. ఆ రాజు వాటికి నచ్చలేదు. మళ్ళీ వనదేవతను ప్రార్ధించాయి. దేవత ప్రత్యక్షం అయింది. "తల్లీ! మాకీ రాజు పనికిరాడు. మరో కొత్త రాజుని ఇవ్వు" అన్నాయి కప్పలు. "మీది అమాయకత్వమో, మూర్ఖత్వమో తెలీకుండా వుంది. హాయిగా ఆడుకుంటారు కదా అని కుండని ఇస్తే, కాదు కూడదంటున్నారు." అన్నది మందలింపుగా దేవత. "ఇంతకన్నా మంచి రాజుని ఇవ్వు తల్లీ!" అన్నాయి కప్పలు. దేవత చాలా ఆలోచించింది. కప్పల మీదనున్న జాలి వల్ల చంద్రుణ్ణి ఇచ్చింది. కప్పలు కోరినప్పుడల్లా చంద్రుడు వచ్చేవాడు. వాటితో ఆడుకొనేవాడు. కలిసిమెలసి తిరిగేవాడు. చల్లగా పండువెన్నెల ఇచ్చేవాడు. తినగా తినగా చెక్కర కూడా చేదైనట్టుగా హాయిగా చల్లగా వున్న చంద్రుడు కూడా కప్పలకు నచ్చలేదు. గొణుక్కుని మళ్ళీ దేవతని ప్రార్థించాయి. దేవత ప్రత్యక్షం అయ్యి ఏమైందని అడిగింది.. " ఎంతసేపూ తగని వాళ్ళనే రాజుగా యిస్తున్నావు! కాస్త కరుకైన వాళ్ళని యివ్వు.." అన్నాయి కప్పలు. " మీరు మూర్ఖులు.. రాజుని ఎవరూ కోరుకోరు. నేను మీకు స్నేహితుల్ని యిచ్చాను. ఐనా ఏం లాభం? వాళ్ళ మంచి చేదయిందీ" అన్నది దేవత. " ఏమైనా సరే, మాకు రాజు కావాలి!" అని పట్టుబట్టాయి కప్పలు. దేవతకి విసుగెత్తింది. అనుభవిస్తే కాని తెలియదు అని అనుకున్నది. ఒక కొంగని రాజుగా యిచ్చి వెళ్ళిపోయింది. మట్టికుండ, చంద్రుడులాగా కాకుండా నిబ్బరంగా గట్టుమీద కూర్చుంది కొంగ. ఇది కప్పలకు గొప్ప లక్షణంగా కనిపించింది. " ఓహొ కొంగరాజా! నువ్వు చాలా గొప్పవాడివి. ఇంతకు ముందున్న రాజులు ఉత్త దద్దమ్మలు. నీ ఠీవి, గంభీరత అద్భుతం! మాకు అన్ని విధాలా నచ్చావు. ఖడ్గం లాంటి నీ ముక్కు ఒక్కటి చాలు మమ్మల్ని పరిపాలించడానికి" అని సంబర పడ్డాయి కప్పలు. కొంగ ఏమీ మాట్లాడలేదు. చెరువు వైపు చూస్తూ కూర్చుంది. ఆ మర్నాటినించి కొంగ ఒక్కొక్క కప్పను తినేయడం మొదలు పెట్టింది. కొద్దిరోజుల్లో కప్పలకు విషయం అర్థమయ్యింది. ఏ ముక్కును పొగిడాయే ఆ ముక్కే మృత్యువయింది. రోజురోజుకి చెరువులో కప్పలు తగ్గిపోసాగాయి. 'ఓ దేవతా! మాకు రాజు వద్దే వద్దూ.. ఈ బాధల్ని తప్పించు' అని ఏడ్చాయి కప్పలు. కాని ఏం లాభం దేవత మునుపటిలా మళ్లీ ప్రత్యక్షం అయితే కాలేదు. ఈ కథలో నీతి ఏమిటంటే.. " మూర్ఖులు ఎవరి మాటా వినరు.. అందుకే కష్టాలు కొని తెచ్చుకుంటారు. "

Comments

Popular posts from this blog