విశ్వాసంలేని కుక్క || Faithless Dog Bedtime stories CompilationTelugu Mo...


#విశ్వాసంలేనికుక్క #faithlessdogtelugumoralstory #panchatantrakathalu ************** విశ్వాసంలేని కుక్క నీతికథ ************ ఒక ఊరిలో ఒక బట్టల వ్యాపారి వుండేవాడు. అతని దగ్గర ఒక గుర్రం, ఒక కుక్క వుండేవి. అతను పట్టణంలో కొన్న కొత్త బట్టలను మూటగా కట్టి గుర్రం వీపుపైన పెట్టి ఇంటికి తీసుకుని వచ్చేవాడు. తరువాత, ఆ బట్టల మూటలను గుర్రంపై వేసుకుని ఊరూరా తిరుగుతూ వ్యాపారం చేసేవాడు. అలాగే తన ఇంటికి కాపలాగా కుక్కను పెంచుకునేవాడు. ఆ యజమాని చాలా మంచి వాడు కావడంతో కుక్క కన్నా గుర్రం ఎన్నో రెట్లు ఎక్కువ కష్టపడినా వాటికి ఏ లోటూ రానీయకుండా రెండింటినీ సమానంగా చూసేవాడు. అయితే, ఆ యజమాని ఎంత బాగా చూసినా ఆ కుక్కకు అసంతృప్తి గానే వుండేది. అతని దగ్గర పని చేయడం దానికి అస్సలు ఇష్టం వుండేది కాదు. ఎలాగైనా అక్కడి నుండి బయట పడి స్వేచ్చగా బ్రతకాలని ఎప్పుడూ ఆరాటపడేది. అది సరియైన ఆలోచన కాదని గుర్రం దానికి ఎన్ని సార్లు చెప్పినా వినేది కాదుకదా గొడవకు దిగేది. ఒకరోజు ఒక దొంగ వ్యాపారి ఇంటికి కన్నం వేయడానికి వచ్చాడు. ఆ సమయంలో వ్యాపారి గాఢ నిద్రలో వున్నాడు. అక్కడ దగ్గరలో గుర్రం లేదేమో, జరుగుతున్న తతంగాన్ని పెరట్లో తాడుతో కట్టివేయబడిన కుక్క పసికట్టింది. దొంగ వ్యాపారి ఇంటిలోకి చొరబడి చాలా విలువ గల బట్టల మూటలు ఒక్కొక్కటి ఇంటి వెనకాల నిలబెట్టివున్న బండి పైకి చేరవేయ సాగాడు. యజమానిని అప్రమత్తం చేయాలన్న ఆలోచనే ఆ కుక్కకు రాలేదు. నిశ్శబ్దంగా చూస్తూ వుండిపోయింది. దొంగ చివరి మూటను మోసుకు వెళుతుండటంతో.... "అయ్యా.. అదే చేత్తో నా కట్లు కూడా విప్పండి" అని అడిగింది. "ఎందుకు?" అని అడిగాడు దొంగ. "ఇక్కడ బ్రతకడం నాకు ఇష్టం లేదు" "మరి నీ కట్లు విప్పితే నాకేంటి లాభం?" "కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు, జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి వుంటాను" అంది. దాని మాటలకు ఆ దొంగ పకపకా నవ్వి ఇలా అడిగాడు. "అవునూ... నేను దొంగని. నీకా విషయం ఇప్పటికే అర్ధమయి వుండాలి. మరి నీ యజమానిని నిద్రలేపలేదేమిటీ." "నాకు నా యజమాని అంటే అసహ్యం. అతని సొత్తు పోతే నాకేంటీ? చూడు... నువ్వు దొంగిలిస్తుంటే నిన్ను పట్టించే అవకాశం వున్నా అడ్డు పడలేదు. అందుకు కృతజ్ఞతగా నేను చెప్పిన పని చేయడం నీ ధర్మం" అంది ఆ కుక్క. కుక్క మాటలకు దొంగ మళ్ళీ పడీ పడీ నవ్వాడు. " కృతజ్ఞత గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీలో అవి వున్నాయా? నిన్ను సంరక్షించే నీ యజమాని పట్ల నీకు కృతజ్ఞతే లేదు. వుంటే నువ్విలా స్వార్ధంగా ప్రవర్తించవు. నీలాంటి విశ్వాసంలేని కుక్కను వెంట తీసుకుపోయి వుంచుకోవటం ఎప్పటికీ ప్రమాదమే. విశ్వాసం లేని పనివాడికి యజమాని అయ్యే కంటే అసలు.... పని వాడు లేక పోవడమే మేలు..." అంటూ అక్కడి నుంచి నిశ్శబ్దంగా జారుకున్నాడు దొంగ. ఒక దొంగలో వున్న నీతి తనలో లేనందుకు విచారిస్తూ ఒక్క క్షణం ఆలోచనలో పడిపోయిందా కుక్క. వెంటనే తేరుకుని గట్టిగా మొరగడం ప్రారంభించింది. ఆ దొంగ భయంతో బట్టల మూటలను అక్కడే వదిలేసి వేగంగా పరుగు లంకించాడు. తర్వాత, విలువైన సొత్తును కాపాడి తన పట్ల విశ్వాసాన్ని చాటిన కుక్కను ఆ యజమాని ఎంతగానో మెచ్చుకున్నాడు. తర్వాత అది గుర్రంతో కూడా చెలిమి చేయసాగింది. ఈ కథలో నీతి ఏమిటంటే, " మన యజమాని పట్ల ఎప్పుడూ నమ్మకాన్ని కలిగి వుండాలి. "

Comments

Popular posts from this blog