వేరుశనగల దొంగ తెలుగు నీతి కథ || Latest Telugu Morals story by Bamma kathalu


#telugumoralstory #latesttelugushortfilm #moralstory ********** 360. వేరుశనగల దొంగ. ************ ఒక ఊరిలో చందు అనే మేకల కాపరి ఉండేవాడు. ఆ కుర్రవాడు రోజూ ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవిలోకి మేకలను తోలుకుని వెళ్లేవాడు. అతను చెట్టుక్రింద ఉన్న పెద్ద బండరాయి మీద కూర్చుని, ఆ మేకలను స్వేచ్చగా వదలేసేవాడు. అవి అడవిలో రోజంతా మేసేవి. చందు అక్కడే కూర్చుని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న తినుబండారాలు హాయిగా తింటూ ఉండేవాడు. సాయింత్రం కాగానే తిరిగి మేకలను తోలుకుని గూటికి చేరేవాడు. ఒకనాడు మేకలను తోలుకుని అడవికి వెళ్లిన చందుకు, తను ఎప్పుడూ కూర్చునే బండరాయి మీద అప్పటికే మరొక ముసలివాడు కూర్చుని ఉండటం గమనించాడు. రోజూ అక్కడే కూర్చునే అలవాటు పడిన చందుకి ఆ చెట్టు, ఆ రాయి ప్రత్యేకించి తనదే అన్న ఒక భావం ఏర్పడిపోయింది. కానీ ఆ పెద్దాయనను అక్కడి నుంచి వెళ్లిపొమ్మనలేడు. అతను తోలుకుని వచ్చిన ఆవులు చెల్లాచెదురుగా ఉండి మేస్తూ కనిపించాయి. చందు తన మేకలను కూడా మేతకు వదిలేసి కోపంతో రుసరుసలాడుతూ వెళ్లి ఆ ముసలాయన ప్రక్కనే కూర్చున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు పలుకరించుకోకుండా మౌనంగానే గడిపారు. కొంతసేపటి తరువాత చందుకి ఆకలిగా అనిపించడంతో తను తెచ్చుకున్న వేరుశనగ కాయల పొట్లం విప్పి, ప్రక్కన పెట్టి ఒక్కొక్కటిగా వల్చుకుంటూ తినడం మొదలుపెట్టాడు. చాలాసేపు మైమరిచిపోయి ఆనందంగా తింటూ ఉన్నాడు. తీరా చూస్తే పక్కనున్న ముసలాయన కూడా అదే పొట్లంలోంచి వేరుశనగలు తీసుకుని తింటున్నారు. "ఇతనికి ఎంత పొగరు.. అడగకుండానే నా వేరుశనగలు తినేస్తునాడు. పాపం పెద్దవాడు కదా అని నా చోటులో కూర్చోనిస్తే అసలు మర్యాదే లేదు" అని మనసులో చాలా తిట్టుకుంటూ పైకి ఏమి అనలేక అలాగే ఉండిపోయాడు. కొద్దిసేపటి తరువాత ఎక్కడ పెద్దాయన వేరుశనగలు అన్నీ తినేస్తాడో అని పోటిపడి మరీ చందు గబగబా మిగిలిన వేరుశెనగలు వల్చుకుని తినేయడం మొదలుపెట్టాడు. కుర్రవాడు, ముసలివాడు వేగంగా తింటూ ఉన్నారు. అన్నీ అయిపోయి చివరికి ఒక్క వేరుశనగ మాత్రమే మిగిలింది. పెద్దాయన చిరునవ్వుతో "ఇది నువ్వు తిను బాబూ.." అని లేచి తన ఆవులను తోలుకుంటూ నెమ్మదిగా వెళ్ళిపోయాడు. దూరంలో వెళుతున్న అతన్ని చూస్తూ చందు "వేరుశనగల దొంగ!" అని తిట్టుకున్నాడు. తరువాత తీరిగ్గా లేచి తన సామాను తీసుకుంటూ చూస్తే అక్కడ తన వేరుశనగల పొట్లం భద్రంగా కనిపించింది. "అయ్యో! ఐతే నేనే వేరుశనగల దొంగనా! పాపం, అతన్ని ఎంతలా తిట్టుకున్నానో!" అని చాలా బాధ పడ్డాడు. ఆ ముసలాయన ఎక్కడైనా దారిలో కనిపిస్తే క్షమాపణ చెబుదామని తన మేకలను తోలుకుని వేగంగా బయలుదేరాడా కుర్రవాడు. ఈ కథలో నీతి ఏమిటంటే.. "నిజానిజాలు తెలుసుకోకుండా నిందలు వేయకూడదు."

Comments

Popular posts from this blog