ఖరీదైన సలహా తెలుగు నీతి కథ || Expensive advice Telugu moral stories @BA...


ఖరీదైన సలహా తెలుగు నీతి కథ || Expensive advice Telugu moral stories  @BAMMA KATHALU  *********** ఖరీదైన సలహా. ************ క్రిష్ణాపురంలో రామయ్య అనే మంచి పలుకుబడి గల వకీలు వుండేవాడు. తరచూ అతని ఇంటికి ఎవరో ఒకరు వచ్చి సలహాలు తీసుకునేవారు. న్యాయస్థానంలో అనేకమంది తగాదాలను వాదించి గెలిపించాడు. రామయ్య ఇంటి ఎదురుగానే భూషణం అనే వడ్డీ వ్యాపారి ఉన్నాడు. అతను చాలా తిరకాసు మనిషి. ఎలాంటి వారి నుంచి అయినా రకరకాల వడ్డీల పేర్లు చెప్పి ముక్కుపిండి మరీ వసూలు చేసేవాడు. ఒకసారి భూషణం మీద ఫిర్యాదు చేసిన మనిషి తరఫున వాదించి గెలిపించాడు రామయ్య. అప్పటి నుంచి రామయ్య అంటే భూషణంకు ఒళ్లుమంట. అయితే రామయ్య కొడుకు సురేష్, భూషణం కొడుకు గోపాల్‌లు ఇద్దరూ మంచి స్నేహితులు. ఆ ఇద్దరు పిల్లలూ కలసి ఆడుకునేవారు. కలసి బడికి పోయేవారు. అయినా సరే, భూషణం మాత్రం రామయ్యను పలకరించేవాడు కాదు. అతడిని ఎలా అయినా దెబ్బకొట్టాలని అవకాశం కోసం ఎదురు చూస్తుండేవాడు. ఒకనాడు పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు. గోపాల్‌కి సురేష్ కాలు తగిలి తూలి కింద పడ్డాడు. కాలు మెలిక పడి విరిగింది. ఆ కబురు తెలిసి భూషణం నానా హంగామా చేసాడు. వైద్యం ఖర్చులు వెయ్యి రూపాయలు ఇస్తూ గుండెలు బాదుకున్నాడు. " రామయ్య కొడుకు వల్లనే నా కొడుకు కాలు విరిగింది. ఆ వైద్యం ఖర్చులు రెండు రెట్లు అతడితో ఎలాగైనా కక్కించాలి.. జరిగిన విషయం చెప్పి డబ్బు ఇవ్వమంటే వకీలు తెలివి తేటలు చూపి మొండి చెయ్యి చూపిస్తాడు. ఇలాంటప్పుడే అతడిని ఇరికించాలి." అనుకున్నాడు భూషణం. ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా తీవ్రంగా ఆలోచించాడు. తెల్లవారగానే భూషణం సరాసరి రామయ్య ఇంటికి వెళ్లాడు. జరిగిన ప్రమాదం గురించి రామయ్యకి ఇంకా తెలియదు. భూషణం మొదటిసారి తన ఇంటికి రావడం రామయ్యకు ఆశ్చర్యం కలిగించింది. " భూషణం! ఏమిటీ సంగతి?" అని అడిగాడు. " అయ్యా! మీరు పెద్ద వకీలు. మీ దగ్గర చిన్న సలహా కోసం వచ్చాను!" అన్నాడు భూషణం. " దానిదేం వుందీ..అడుగు..." అన్నాడు రామయ్య "మా కుర్రాడిని ఇంకో కుర్రాడు కాలు మెలిక వేసి పడేశాడు. మా వాడి కాలు విరిగింది. వైద్యం ఖర్చులు రెండు వేలు అయ్యాయి. ఆ డబ్బు అవతలి కుర్రాడి నుంచి వసూలు చేయడం న్యాయమే కదండీ?" అన్నాడు భూషణం. "తప్పకుండా వసూలు చేయాలి. కాలు విరిగి నందుకు వైద్యం ఖర్చులు వారే భరించాలి" అన్నాడు రామయ్య. " అయితే ఆ రెండు వేలు ఇప్పించండయ్యా!" . " ఆ కుర్రాడి తండ్రితో మాట్లాడి ఇప్పిస్తాను" . " ఆ కాలు విరగ్గొట్టింది మీ అబ్బాయేనయ్యా!" వెటకారంగా అన్నాడు భూషణం. అప్పుడు అర్థం అయ్యింది రామయ్యకి, భూషణం డొంకతిరుగుడు నాటకం. డబ్బు ఇప్పించమంటూ తొందర చేయసాగాడు. " దానికేం భాగ్యం. మా గుమాస్తాను అడిగి లెక్కలు చూసుకుని డబ్బు తీసుకెళ్లు" అన్నాడు రామయ్య నవ్వుతూ. " రెండువేలకు లెక్కలేమిటి?" అర్థంకానట్లు అడిగాడు భూషణం. " చూడు భూషణం! నా దగ్గరికి చాలామంది వచ్చి సలహాలు తీసుకుని వెళ్తుంటారు. ఆ సలహాకి ప్రతిఫలంగా తగిన సొమ్ము చెల్లించి వెళతారు. నీవు సలహా అడిగావు. చెప్పాను. నా సలహా ఖరీదు అయిదు వేలు. మా గుమాస్తాతో మాట్లాడి అయిదువేలు కట్టేసేయ్‌. నీ నష్టపరిహారంగా వైద్య ఖర్చులకుగాను రెండు వేలు తీసుకుని వెళ్ళు!" అన్నాడు రామయ్య. ఆ సమాధానం వినగానే భూషణం నోరెళ్ళబెట్టాడు. తను విసిరిన తాడు తన మెడకే చుట్టుకున్నందుకు ఖంగు తిన్నాడు. తేలు కుట్టిన దొంగలా మారుమాట్లాడకుండా అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. అతడి తిక్క కుదిరినందుకు రామయ్య నవ్వుకున్నాడు. ఈ కథలో నీతి ఏమిటంటే.. " మన దుష్ట ఆలోచనలు మనకే ఇబ్బందిని కలిగిస్తాయి."

Comments

Popular posts from this blog