The leader of the crows Telugu story || కాకుల నాయకుడు తెలుగు కథ @BAMMA K...


#కాకులనాయకుడుతెలుగుకథ #theleaderofthecrows #telugumoralstories ************ కాకుల నాయకుడు. *************** అనగనగా ఒక అడవిలో కాకుల గుంపు ఒకటి వుండేది. తమ గుంపులో ఒకరిని నాయకుడిగా ఎన్నుకోవాలని అవన్నీ నిర్ణయించుకున్నాయి. అందుకోసం రకరకాల పోటీలు కూడా జరిగాయి. కాకులన్నింటిలో విజేయుడు, అజేయుడు అనే రెండు కాకులు చివరి వరకూ పోటీ పడుతూ వచ్చాయి. అన్ని అంశాలలోనూ ఆ రెండింటి మధ్య గట్టిపోటీ నెలకొనడంతో తుది పోరు ఎలా నిర్వహించాలో తెలియక వయసులోనూ, అనుభవంలోనూ పెద్దవి అయిన కాకులన్నీ తలలు పట్టుకున్నాయి. " ఏముందీ .. ఈ బాధ్యతను మన అడవికి మంత్రి అయిన నక్కకు అప్పగిస్తే సరిపోతుంది.." అన్నాడు అజేయుడు.. ఎందుకంటే అజేయుడికీ, నక్కకు మంచి స్నేహం వుంది.. నక్క వస్తే తనను ఎలాగైనా గెలిపించి తీరుతుందని ఆ కాకి నమ్మకం. తెలివితేటలలో నక్కను మించిన వారు లేరు కనుక ముసలి కాకులన్నీ వెళ్లి నక్కను కలిసి సమస్యను వివరించి, సహాయాన్ని అర్దించాయి.. " మహా పెద్ద సమస్య అయితే తప్పా ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు నా దగ్గరకు రాకూడదు.. సరేలే, మీరందరూ గుంపుగా వచ్చి అడుగుతున్నారు కాబట్టి కాదనలేకపోతున్నాను.. రేపు నేను వచ్చి దగ్గరుండి పోటీ పెడతాను.. అందులో గెలిచిన వాళ్ళే మీ నాయకుడు.. వెళ్ళిరండి." అని పంపించి వేసింది.. ఆ రాత్రికే తనను కలిసిన కాకి మిత్రుడుకి తన ఎత్తుగడనంతా వివరించింది నక్క.. "చూడు మిత్రమా.. రేపు నేను రెండు సంచులను సిద్దం చేసి వుంచుతాను..ఆ సంచులలో ఏం వుందో ఎవ్వరికీ తెలియదు.. రెండూ సమానమైన బరువుకలవనే భావిస్తారంతా.. కానీ, ఆ సంచులలో ఒక దానిలో దూది వుంటుంది.. రెండవ దానిలో ఉప్పువుంటుంది. ఆ సంచులను భుజం మీద వేసుకుని ఎవరు ఎక్కువ ఎత్తుకు ఎగురుతారో వారే విజేత.. అయితే, నీవు బరువు లేకుండా తేలిగ్గా వుండే దూది సంచిని తీసుకో.. నీ ప్రత్యర్ది ఎగరడం అటువుంచూ, ఉప్పు మూటను మోయలేక నడుం విరగొట్టుకుంటాడు..." అంటూ పకపకా నవ్వింది. " అది సరే మిత్రమా.. దూది సంచి ఏదో, ఉప్పు సంచి ఏదో నాకు ఎలా తెలుస్తుంది.. " అని సందేహాన్ని వ్యక్తం చేసింది కాకి. "ఇంత జిత్తులమారి సలహా ఇచ్చిన దానిని అది చెప్పకుండా వుంటానా.. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో.. నీలం రంగుది దూది సంచి , పసుపు రంగుది ఉప్పు సంచి.. " తెల్లవారగానే నక్క నేతృత్వంలో రెండు కాకుల మధ్య పోటీ మొదలైంది. ఆ పోటీని చూడటానికి అడవిలో వున్న కాకులన్నీ వచ్చాయి.. ముందే అనుకున్నట్టు నక్క స్నేహితుడైన అజేయుడు వేగంగా వెళ్లి నీలం రంగు గల దూది మూటను తన భుజం మీద వేసుకున్నాడు. ఇక విజేయుడు పసుపు రంగు గల చాలా బరువైన ఉప్పు మూటను తీసుకున్నాడు. రెండూ బరిలో నిలిచాయి.. ఎలాగూ విజయం తనదేనని నిశ్చయమైపోవడంతో విజయుడిని చూసి అజేయుడు హేళనగా నవ్వాడు. పోటీ ప్రారంభమైంది.. రెండు కాకులూ వేగంగా గాల్లోకి లేచాయి..అయితే, వున్నట్టుండీ ఒక్కసారిగా జోరుగా వాన కురవడం మొదలైంది. కొద్దిసేపటికే వర్షానికి ఉప్పంతా కరిగిపోవడంతో, ఆ మూటను మోస్తున్న విజేయుడు ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోయాడు. ఇక దూదంతా వర్షానికి బాగా తడిసి చాలా బరువెక్కడంతో అజేయుడు ఎగరలేక అరుస్తూ నేల మీద బొక్కబోర్లాపడి కాళ్లు విరగొట్టుకున్నాడు.. ఒకరు తన మంచి తనంతో విజయం సాధించి కాకుల నాయకుడైతే.. మరొకరు తన దుర్బుద్దితో జిత్తుల మారి నక్కను నమ్ముకుని నవ్వుల పాలయ్యారు. ఈ కథలో నీతి ఏమిటంటే... " దుష్ట ఆలోచనలు ఎప్పటికీ నష్టాన్నే కలిగిస్తాయి. "

Comments

Popular posts from this blog