Ghost story Telugu Moral story || మంచి దెయ్యం తెలుగు కథ @Chulbul Tv


***************** మంచి దెయ్యం ************** నాగపట్నంలో గోపాల్ అనే కుర్రవాడు వుండేవాడు. వాళ్ళది చాలా పేద కుటుంబం. తల్లి మంచాన పడటంతో ఇంటి భారం మొత్తం గోపాల్‌పైనే పడింది. దాంతో పట్నంలో పనికి కుదిరాడు. ఆ వూరి వాళ్ళంతా వాహనాలపై పనికి పట్నానికి వెళుతుంటే.. పాపం, డబ్బులు లేక గోపాల్ పట్నానికి దగ్గర దారైన అడవి మార్గం గుండా వెళుతుండేవాడు. ఓనాడు అడవి దారి గుండా పట్నానికి వెళుతున్న గోపాల్‌కి బాగా దాహం వేసింది. దగ్గరలో కనిపిస్తున్న బావి వద్దకు వెళ్లి నీటి కోసం లోనికి చూసాడు. అంతే, అమాంతం ఒక్కసారిగా బావిలోంచి దెయ్యం ఒకటి శబ్దాలు చేసుకుంటూ బయటకు వచ్చింది.. దాన్ని చూస్తునే గోపాల్ భయంతో వణికి పోయాడు. " ఇది నా స్దావరం... ఇందులో నీళ్ళు వుండవు .. ఈ బావిలో నేను వుంటానని తెలిసి ఇక్కడకు ఎవరూ రారు.. కానీ నువ్వు వచ్చావు.. " " నాకు తెలియక వచ్చాను.. నన్ను వదిలేయ్.. " అని భయంతో వేడుకున్నాడు. " తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే.. నాకు చాలా ఆకలిగా వుందీ.. నీ సంచిలో ఏమున్నాయ్.. " అని లాక్కుని అతని సంచిలో వున్నవన్నీ ఆబగా తినేసిందీ.. " నేను రోజూ తిండి కోసం అలమటిస్తున్నా నా ఆకలి తీర్చేవారే లేరు.. నీ ఆహార పదార్దాలు చాలా రుచిగా వున్నాయి.. రోజూ నువ్వు నాకోసం ఇలాగే తెస్తానంటే నిన్ను ఏం చేయకుండా వదిలేస్తా..లేకుంటే ఇప్పుడే నిన్ను అంతం చేస్తా. " అప్పటికే ముచ్చెమటలు పట్టిన గోపాల్ సరేనని తలాడించాడు. తనను ఏం చేయకుండా వదిలినందుకు బ్రతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకుని వెళ్లిపోయాడు. ఆనాటి నుండి ఇచ్చిన మాట ప్రకారం అతను రోజూ దెయ్యం కోసం రకరకాల పదార్దాలు తెచ్చేవాడు.. దెయ్యం వాటిని లొట్టలు వేసుకుంటూ తినేసేది. ఒక్కోసారి తనకు చాలలేదంటూ, ఇలా లేదు అలా లేదు అని కసురుకునేది. ఒకరోజు దెయ్యాల కోసం గాలిస్తూ మాంత్రికుడు ఒకడు గోపాల్ దగ్గరకు వచ్చాడు. " ఓరే అబ్బాయ్.. నిన్ను చూస్తుంటే ఈ అడవి మొత్తం జల్లెడ పట్టిన వాడివిలా వున్నావు.. నేను మహా మాంత్రికుడిని కావడానికి ఒక పూజ చేస్తున్నాను.. ఎక్కడైనా దెయ్యాన్ని చూసావా.." " దెయ్యమా...దెయ్యమా.. లేదయ్యా .. నాకు దెయ్యం పేరువింటేనే చచ్చేంత భయం.." గోపాల్ అలా చెప్పడంతో మాంత్రికుడు ముందుకు వెళ్లిపోయాడు.. అంతా చాటుగా వుండి విన్న దెయ్యం అతని ముందుకు వచ్చి ఇలా అడిగింది .. " అన్ని కష్టాలు పెట్టినా నన్ను ఆ మాంత్రికుడికి ఎందుకు పట్టి ఇవ్వలేదు.." " ఎందుకంటే, నీవు నన్ను ఏమీ చేయలేదు.. ఆకలి మాత్రమే తీర్చుకుంటున్నావు.. నీవు నాపై ఒక్కోసారి కోపాన్ని తెచ్చుకున్నా నేను మిత్రుడిగానే భావించాను... నీవు మంచి దెయ్యానివి.. " ఆ మాటలు వినగానే తను ఇంతకాలం గోపాల్‌ని కష్టాలు పెట్టినందుకు దెయ్యం చాలా బాధపడింది. క్షమాపణ కోరింది.. సహాయం చేయాలని భావించింది.. తను బ్రతికి వున్నప్పుడు సంపాదించి పెట్టిన డబ్బు, నగలు అతనికి అందించింది.. ఇద్దరూ మంచి మిత్రులు అయిపోయారు. అతన్ని రోజూ తన భుజాలపై కూర్చోబెట్టుకుని పట్నానికి తీసుకెళ్లి దింపేది. గాల్లో ఎగురుకుంటూ వస్తున్న గోపాల్‌ని చూసి మిగిలిన వాళ్ళంతా ఆశ్యర్యపోయేవారు. అందుకే అంటారు .. " మన మంచితనం ఏదో ఓనాడు మనకు సహాయపడుతుందనీ.. "

Comments

Popular posts from this blog