Crane and crab fishes Telugu moral story || కొంగ దొంగ జపం @BAMMA KATHALU ​


#kongajapam #greedycrane #moralstory *************** కొంగ దొంగ జపం *************** ఒక అడవిలో చిన్న చెరువు వుండేది. అందులో రకరకాల చేపలు, ఒక ఎండ్రకాయ కలిసిమెలిసి జీవిస్తూవుండేవి. అయితే వీటితో స్నేహం చేయాలని ఒక ముసలి కొంగ ఎప్పుడూ ప్రయత్నిస్తూ వుండేది. "చేపలూ..చేపలూ మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది.. నన్ను కూడా మీతో స్నేహం చేయనివ్వరూ!" అని అడిగింది కొంగ. "అమ్మో నీతో స్నేహమే .. మీ కొంగలకు మా జాతివారు ఇప్పటికే చాలా మంది ఆహారమైపోయారు. వద్దు..వద్దు.." అంది ఓ చేప. "మీకు తెలియనట్టుంది.. నేను ప్రాణులను చంపి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాను. ఆకులు, అలమలు మాత్రమే తింటున్నాను. అందుకే చూసారా ..ఎంతగా చిక్కిపోయానో.." అంటూ నీరసం నటించింది కొంగ. "ఏదేమైనా మేం నీతో స్నేహం చేయం..నీదీ మాదీ బద్ద శత్రువుల జాతి.." అంది మరో చేప. " సరేలే.. నాకు మీతో స్నేహం చేసే అదృష్టం లేదనుకుంటాను. వచ్చే జన్మలోనైనా నన్ను చేపలా పుట్టించమని ఆ దేవుడిని వేడుకుంటాను." అంటూ బాధపడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇలా కొంతకాలం గడిచింది. ఓ రోజు కొంగ, చెరువు మధ్యలో ఒంటికాలిపై నిలబడి జపం చేయసాగింది. "ఏంటీ మాతో స్నేహం కోసం జపం చేస్తున్నావా" అని ఓ చేప అనగానే.."అవును.. అవును..కొంగజపం-దొంగజపం" అంటూ మిగిలిన చేపలు నవ్వాయి. "నవ్వండి..నవ్వండీ ..నేనేం బాధపడను. కానీ నా ఈ జపం మిత్రులైన మీకోసమే అని తెలుసుకుంటేచాలు.." అంది కొంగ. "మా కోసమా ఏం జరిగింది?" అడిగింది చేప. "మరో పక్షం రోజుల్లో ఎండల ధాటకి ఈ చెరువు ఎండిపోతుందట..నిన్ననే ఆకాశవాణి నాతో చెప్పింది.. ఆ తర్వాత మీ పరిస్థితి తలుచుకోగానే రాత్రినుంచి ముద్దదిగడంలేదు" అంది కొంగ ఒంటి కన్నుతో జపం చేస్తూ. ఆ మాట వినగానే వాటి పైప్రాణాలు పైనే పోయాయి. "ఇప్పడు ఏం చేయాలా? " అని అన్ని చేపలు ఆలోచనలో పడ్డాయి. "మీరు వింటానంటే ఓ ఉపాయం చెబుతాను.".అంది కొంగ. "చెప్పు..చెప్పు.. వెంటనే చెప్పు.." అన్నాయి చేపలు. "దగ్గరలో మరో పెద్ద చెరువు వుంది. అది అన్ని కాలాల్లోనూ నీటితో నిండివుండి..రకరకాల ప్రాణులతో నిత్యం కళకళలాడుతూవుంటుంది. అక్కడికి వెళ్ళడం మంచిదని నా అభిప్రాయం." "నీవు చెప్పింది బాగానే వుంది.. కానీ మేమంతా అక్కడికి చేరడం ఎలా?' సందేహం వెలబుచ్చింది ఎండ్రకాయ. "అపాయం గురించి చెప్పిన దాన్ని .. ఉపాయం ఆలోచించకుండా వుంటానా..! మిమ్మల్నందర్నీ ఒక్కొక్కరుగా తీసుకువెళ్ళి భద్రంగా ఆ చెరువులో వదిలేస్తాను .. సరేనా." "సరే...సరే .." అన్నీ ముక్త కంఠంతో బదులిచ్చాయి. ఆ విధంగా మొదటి చేపను తన నోట కరుచుకుని ఎగిరిపోయింది కొంగ. అలా కొంతదూరం ప్రయాణించి ఓ గుట్టపై వాలి ఆ చేపను తినేసి ..దాని ఎముకల గూడుని ప్రక్కన పడేసింది. ఇలా కొన్ని చేపలు దాని దుష్ట పన్నాగానికి బలైపోయాయి. ఆ రోజు ఎండ్రకాయ వంతు వచ్చింది. కొంగతో పాటుగా గాల్లో ఎగురుతూ "నీ వంటి మిత్రులు దొరకడం మా అదృష్టం" అంది ఎండ్రకాయ. "అవునవును.. మీ వంటి బుద్దీహీనులు దొరకడం నా అదృష్టం కూడా.." అని పగలబడి నవ్వసాగింది .. కొంగ ప్రవర్తనలో మార్పును గ్రహించిన ఎండ్రకాయ తనను చెప్పిన చోటుకు కాకుండా ఎటో తీసుకుని వెళ్తున్నట్టు పసిగట్టింది. ఆ ప్రయాణంలో నేలమీద తన మిత్రుల అస్దిపంజరాలను చూసిన ఎండ్రకాయకు కొంగ తమను అందర్నీ నమ్మించి మోసం చేసిందని అర్ధమైపోతుంది. కోపంతో రగిలిపోతుంది. ఒక్కసారిగా కొంగ మెడను కొరికి చంపేస్తుంది. తర్వాత చెరువుకు చేరుకుని కొంగ చేసిన మోసం మిగిలిన చేపలకు చెబుతుంది. తమ మిత్రులు కొందరు దూరం కావడంతో అంతా బాధ పడతారు. ఈ కథలో నీతి ఏమిటంటే.. "తియ్యని మాటల వెనుక ఏదో ఒక మోసం దాగివుంటుంది, జాగ్రత్తగా నడుచుకోవాలి."

Comments

Popular posts from this blog