KOTHALA RAAYUDU BANDA BAABU


#moralstories #telugushortfilm #latestvideo ********* 359. కోతలరాయుడు బండబాబు. ************ ఒకరోజున బండబాబు గ్రామ జమీందారు వద్దకు వచ్చాడు. "జమీందారు గారూ.. మాది దూరపుప్రాంతం. ఇప్పుడే ఈ ఊరికి వచ్చాను. నేను చాలా బలవంతున్ని. నేను ఒకసారి ఒక పర్వతాన్ని కూడా పైకి ఎత్తాను. నేను వందశేర్ల పాలు తాగుతాను. నేను పులులు, సింహాలతో కూడా పోట్లాడతాను." అని చెప్పాడు. ఆ కండలు తిరిగిన వస్తాదుని చూసి జమీందారు చాలా మెచ్చుకున్నారు. "ఇటువంటి వీరుడు మా గ్రామంలో ఉంటే ముందు ముందు చాలా ఉపయోగముంటుంది. " అనుకొని అతడు ఉండటానికి అక్కడే అన్ని ఏర్పాట్లు చేసారు. నిజానికి ఆ బండబాబుకి పనేమీ ఉండేది కాదు. రోజూ ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడం, దారిన పోయేవారికి తన కండలు ప్రదర్శించడం.. వ్యాయామం చేసి అలసిపోవడం వలన యాభై కోడిగుడ్లు, పది నాటుకోళ్ళు తిని.. వందశేర్ల పాలు త్రాగడం.. మితిమీరిన తిండి మెక్కడం వల్ల గుర్రుపెట్టి నిద్రపోవడం.. ఇలా కొన్నాళ్లు గడిచిపోయింది. ఆ ఊరికి ఆనుకుని పెద్ద కొండ ఉంది. అడవిలా ఉండే ఆ కొండమీద కౄర జంతువులు ఉండేవి. రాత్రి కాగానే తోడేళ్లు, ఎలుగుబంటులు, పెద్దపులులు వంటి కౄరమృగాలు ఆ ఊరిలోకి వచ్చి తరచూ పశువుల్ని ఎత్తుకుపోయేవి. అప్పుడప్పుడూ మనుషులకు కూడా హానిచేసేవి. ఆ ఊరి జనం వచ్చి ఎప్పుడూ జమీందారు గారితో తమ కష్టాలను తొలగించమని మొరపెట్టుకునేవారు. ఈ సారి జమీందారుకి బండబాబు, అతని సాహస కృత్యాలు జ్ఞాపకం వచ్చాయి. వెంటనే ఆయన వస్తాదును పిలిపించి "నీవు ఇదివరకు ఒక పర్వతాన్ని ఎత్తి అవతల పడవేసినట్లు చెప్పావు. అది నాకు గుర్తుంది. ఇప్పుడు ఈ ఊరికి ప్రక్కనే అడవితోనున్న పర్వతం ఒకటి ఉంది. దాన్ని ఎత్తి దూరంగా పడవేయాలి" అని చెప్పారు. అందుకు ఆ వీరుడు సరేనని అంగీకరించాడు. బండబాబు పర్వతం ఎత్తేరోజు రానే వచ్చింది. ఆరోజున మామూలుకంటే ఎక్కువ తిండితిని బోలెడన్ని పాలు తాగాడు. జమీందారుతో పాటు, ఆ ఊరివాళ్లు చాలా మంది పర్వతం వద్దకు చేరుకున్నారు. కొంతసేపు వ్యాయామం చేసిన తరువాత వస్తాదు .. "జమీందారుగారూ .. మీ మనుషుల చేత పర్వతాన్ని త్రవ్వించండి. అప్పుడు దానిని పైకెత్తి అవతల పడవేస్తాను." అన్నాడు. ఆ మాటతో జమీందారుకి పిచ్చెక్కినంత పనైంది. "పర్వతాన్ని తవ్వడమేంటీ.. నీవే పర్వతాన్ని ఎత్తిపడవేసానని చెప్పావుకదా.." అని అడిగారు. "అవును.. పర్వతాన్ని ఎత్తినట్లు చెప్పాను కానీ, నేనే త్రవ్వి పైకెత్తానని చెప్పలేదు.." అన్నాడు వస్తాదు తాపీగా.. జమీందారుకి చాలా కోపం వచ్చింది. "వీడి మాటలు నమ్మి ఇంతకాలం అనవసరంగా వీడిని మేపాం.. ఈ మోసగాన్ని తన్ని తరమేయండి" అన్నారు. దాంతో ఆ ఊరివాళ్లంతా కోతలరాయుడు బండబాబును అక్కడినుండి పరుగులు పెట్టించారు. ఈ కథలో నీతి ఏమిటంటే.. "గొప్పలకు పోతే కష్టాల్ని కొనితెచ్చుకున్నట్టే.. "

Comments

Popular posts from this blog