పిల్లి చెప్పిన తీర్పు నీతి కథ || Greedy Cat and Rabbit crow Telugu mora...

#bedtimestories #moralstories #panchatantrakathalu ************ పిల్లి చెప్పిన తీర్పు ************* అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు తొర్రలో కాకి ఒకటి నివసిస్తూ వుండేది. ఒకనాడది ఆహారం కోసం వెళ్ళి వచ్చేటప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. కాకి బయటకు వెళ్ళిన సమయంలో ఒక కుందేలు వచ్చి కాకి నివసించే తొర్రలో దూరి పడుకుంది. కాకి సాయంత్రం వచ్చి తానుండే తొర్రలో కుందేలు ఉండడం చూసి ‘ఎవరు నువ్వు? ఇది నా నివాసం. నేను లేని సమయం చూసి ఆక్రమించుకున్నావా? వెంటనే వెళ్ళిపో’ అంది కోపంగా. అప్పుడా కుందేలు ‘ఆహా.. ఈ చెరువులు, గుహలు, చెట్లు, తొర్రలూ ఇవన్నీ ఏ ఒక్కరి సొత్తూ కాదు. అందరికీ చెందుతాయి. ఆ సమయంలో ఎవరు నివాసముంటే వారివే అవుతాయి. ఇప్పుడు నేనున్నాను కనుక ఇది నాదే. నీవే ఇంకో చోటు వెతుక్కో. ఫో ఇక్కడినుంచి’ అని కసిరింది. కుందేలు మాటలకి ‘నా ఇంటిని ఆక్రమించి పైగా నన్నే పొమ్మంటున్నావా? ఇది అన్యాయం. నువ్వే వెళ్ళిపో లేదా నీకూ నాకూ పోట్లాట తప్పదు.’ మరింత కోపంగా అన్నది కాకి. అలా అవి రెండూ కాసేపు తగవులాడుకున్నాయి. చివరికి .. "సరే, ఎవరైనా పెద్దలను న్యాయమడుగుదాము. వారు చెప్పినట్లు నడుచుకుందాము. " అన్నది కుందేలు. అప్పుడు కాకి ‘సరే అలాగే చేద్దాము. పద, ఇక్కడికి దగ్గరలో గొప్ప పండితుడూ, విద్యావంతడు, అందరికీ తీర్పులు చెప్పే ఒక పిల్లి ఉన్నది. అక్కడికి వెళ్ళి మన తగవు చెప్పి న్యాయమడుగుదాము’ అని చెప్పింది. అంతే కుందేలు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ‘ఏంటీ..? పిల్లి దగ్గరకు వెళ్లి తగవు తీర్చమందామా..? అతివినయము, క్రూరత్వము, దొంగతనము పిల్లి జాతి లక్షణాలు. ఎవ్వరైనా ఎంతటి విద్యావంతులైనప్పటికీ జాతి లక్షణాలు మార్చుకోవడం అసంభవం. దుష్టులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కనుక మరలా ఒకసారి ఆలోచించు’ అన్నది కుందేలు. ‘ఆ పిల్లి గొప్పతనం తెలియక నువ్విలా అంటున్నావు. అతడెంత బుధ్ధిశాలో నీకు తెలియదు. ఈ అడవిలో ఎవరికి తగాదా వచ్చినా అతడే తీరుస్తాడు. అనవసరపు అనుమానాలు మాని నాతో రా’ అని కాకి అనడంతో, చేసేదిలేక సరేనని దాని వెంట బయలుదేరింది కుందేలు. కాకి, కుందేలూ కలిసి పిల్లి వద్దకు వెళ్ళి కొంత దూరంగా నిలబడి తమ తగదా గురించి చెప్పి న్యాయం చేయమని కోరాయి. పిల్లి వాటిని చూసి ‘అయ్యా మీరెవరో నావద్దకు ఎందుకు వచ్చారో నాకు తెలియదు. నాకేమైనా చెప్పదలుచుకున్నారా? నేను మునుపటి పిల్లిని కాదు. ఇప్పుడు బాగా ముసలివాడిని అయిపోయాను. నాకు కళ్ళూ కనపడవు- చెవులూ వినపడవు. కనుక మీరేమి చెప్పదలుచుకున్నా, నా దగ్గరగా వచ్చి చెప్పండి’ అన్నది నెమ్మదిగా. పిల్లి మోసకారి మాటలు నమ్మిన కాకి, కుందేలూ దాని దగ్గరగా వెళ్ళి చెరో ప్రక్కనా నిలుచుని మరొకసారి తమ తగవు సంగతి చెప్పి చెట్టు తొర్రలో ఎవరు నివాసముండాలో ఎవరు వేరే చోటికి ఎవరు వెళ్లిపోవాలో చెప్పమన్నాయి. అప్పుడు పిల్లి వాటికి న్యాయం చెప్తున్నట్లు నటిస్తూ ‘నాయనలారా.. ఎన్నాళ్ళు జీవించినా ఎవ్వరికైనా ఏదో ఒకనాడు మరణం తప్పదు. ఎప్పటికైనా మనకు తోడుగా వచ్చేది ధర్మమొక్కటే. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ ధర్మమార్గం తప్పరాదు...’ అంటూ పలు నీతి మాటలు చెబ్తూ నెమ్మదిగా కాకికీ, కుందేలుకీ అతి సమీపానికి వచ్చి ఒక్కసారి రెండింటినీ బలంగా ఒడిసి పట్టుకుని ఆహారంగా తినేసింది. ఈ కథలో నీతి ఏమిటంటే... " దుర్మార్గులకు ఎటువంటి పరిస్థితులలోనూ అధికారం ఇవ్వకూడదు. " https://youtu.be/YHJYBMmBap8

Comments

Popular posts from this blog